ఎన్.టి.ఆర్.ను అలా చూపించినందుకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న డైరెక్టర్!
on Oct 24, 2024
1949లో ‘మనదేశం’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో నటుడిగా ప్రవేశించారు ఎన్.టి.రామారావు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. 1970వ దశకం వరకు పౌరాణిక, జానపద చిత్రాలతోపాటు ఎన్నో సాంఘిక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేయడం ద్వారా ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు తన సినిమాల్లోని డాన్సులతో ప్రేక్షకులకు హుషారు తెప్పించేవారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం డాన్సుల జోలికి వెళ్ళలేదు. ఎన్టీఆర్ అంటే రాముడు, కృష్ణుడు అనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ కె.బాపయ్య. 1970లో ‘ద్రోహి’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన బాపయ్య ‘మేమూ మనుషులమే’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ‘ఊర్వశి’ అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. బాపయ్యకు తన నాలుగో సినిమా ఎన్టీఆర్‌తో చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘ఎదురులేని మనిషి’. ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తొలి సినిమా ఇదే. ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచే బాపయ్యపై విమర్శలు మొదలయ్యాయి. ఆఖరికి చిత్ర యూనిట్‌లోని వారు కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సినిమా గురించి అలా ఎందుకు మాట్లాడుకున్నారు? తనపై వచ్చిన విమర్శల నుంచి బాపయ్య ఎలా బయటపడ్డారు? అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘అప్పటివరకు రామారావుగారికి ఉన్న ఇమేజ్‌ని మార్చాలని నిర్ణయించుకున్నాను. అందుకే ‘ఎదురులేని మనిషి’ చిత్రంలో ఆయన కాస్ట్యూమ్ నుంచి అన్ని విషయాల్లో ఛేంజ్ తీసుకొచ్చాను. ఇది చూసి యూనిట్ సభ్యులతో సహా అందరూ ‘ఆ డ్రెస్సులేంటి, ఆ పాటలేంటి.. రామారావుగారిని ప్రేక్షకులు అలా చూడగలరా?’ అంటూ నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. ఈ అనుభవం రామారావుగారికి కూడా జరిగింది. షూటింగ్ డ్రెస్‌లోనే ఇంటికెళ్ళిన ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు ‘మీరేంటి.. మీ డ్రెస్ ఏంటి’ అన్నారట. దానికి రామారావుగారు ‘యువకులు చేస్తున్నారు. చెయ్యనివ్వండి. చూద్దాం’ అన్నారు. ఈ సినిమాలోని ‘కసిగా ఉంది.. కసికసిగా ఉంది..’ అనే పాటను ఆత్రేయగారు రాశారు. ఆ పాటను షూట్ చేస్తున్న టైమ్‌లో కెమెరామెన్ వెంకటరత్నం కూడా ‘ఆ పాటేంటండీ..’ అని నా అసిస్టెంట్స్‌తో అన్నారట. ఆ పాటలో యాక్ట్ చేస్తూనే వాణిశ్రీ కూడా విమర్శించడం గమనించాల్సిన విషయం. ఆమెతోపాటు మిగతా టెక్నీషియన్స్ కూడా రామారావుగారిని అలా చూపించి తప్పు చేస్తున్నానని అన్నారు.
చిత్ర యూనిట్ నుంచే కాదు, ఇండస్ట్రీలోని ఎంతో మంది విమర్శల మధ్య సినిమా పూర్తి చేశాను. రిలీజ్‌కి ముందు నాన్నగారు ప్రకాశరావుగారు ఫోన్ చేసి ‘సినిమా మీద చాలా చెడు ప్రచారం జరుగుతోంది. జాగ్రత్త.. ఎవరికీ ప్రివ్యూ వెయ్యొద్దు’ అని చెప్పారు. ఆ విధంగా ప్రివ్యూ వెయ్యకుండానే సినిమాను రిలీజ్ చేశాం. నాకు సినిమా రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్లే అలవాటు లేదు. నా మొదటి సినిమా ‘ద్రోహి’ని మొదటి రోజు థియేటర్‌లోనే చూశాను. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అది సెంటిమెంట్‌గా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చేసిన ఏ సినిమాకీ మొదటి రోజు థియేటర్‌కి వెళ్ళలేదు. ‘ఎదురులేని మనిషి’ రిలీజ్ రోజు నెల్లూరులోని ఓ థియేటర్‌కి నా అసిస్టెంట్స్ థియేటర్‌కి వెళ్తే అక్కడ పెద్ద క్యూ ఉందట. థియేటర్‌లో పాటల్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని నాకు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఆ టైమ్‌కి రామారావుగారు సక్సెస్ పరంగా, క్యారెక్టర్ల పరంగా కాస్త వెనకబడి ఉన్నారు. ఓపక్క నాగేశ్వరరావుగారు పాటలతో, డాన్సులతో ముందుకెళ్తున్నారు. ఇద్దరూ ఒకే వయసువారు. రామారావుగారితో మనమెందుకు ట్రై చెయ్యకూడదు అని ఈ ప్యాట్రన్‌లో సినిమా చేశాను. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే రామానాయుడుగారి ‘సోగ్గాడు’ షూటింగ్ ఆంధ్రాలో జరుగుతోంది. అది కూడా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. రెండు సినిమాలు ఒకే షెడ్యూల్ కావడంతో నాన్నగారు ప్రకాశరావుగారు ‘ఎదురులేని మనిషి’ సినిమాలోని కొన్ని సీన్స్‌ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే ‘సోగ్గాడు’ విడుదలై అది కూడా పెద్ద హిట్ అయ్యింది. అలా ఎన్.టి.రామారావుగారితో చేసిన ‘ఎదురులేని మనిషి’ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది’ అని తెలియజేశారు దర్శకుడు కె.బాపయ్య. ‘ఎదురులేని మనిషి’ రిలీజ్ అయిన రెండు సంవత్సరాలకు కె.బాపయ్య తమ్ముడు కె.రాఘవేంద్రరావు ‘అడవిరాముడు’ చిత్రాన్ని రూపొందించారు. ఎన్.టి.ఆర్.కు ఈ సినిమాతో పెద్ద కమర్షియల్ హిట్‌ను అందించారు రాఘవేంద్రరావు.
Also Read